రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా శనివారం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఈ సమావేశం జరిగిన తీరును ఆయన 'చిరస్మరణీయమైన ఉదయం'గా పేర్కొంటూ, ప్రధానితో ఉన్న చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే, వీరిద్దరి మధ్య జరిగిన చర్చల వివరాలను ఆయన వెల్లడించలేదు.
ఈ భేటీకి ముందు శుక్రవారం శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కూడా ప్రధాని మోడీని కలిశారు. రైతుల ఉద్యమం నేపథ్యంలో గతంలో అకాలీదళ్‌తో తెగిపోయిన 25 ఏళ్ల పొత్తును బీజేపీ మళ్లీ పునరుద్ధరించుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ రెండు వరుస సమావేశాల ద్వారా పంజాబ్‌లో బీజేపీ కొత్త రాజకీయ వ్యూహాలను సిద్ధం చేస్తోందని తెలుస్తోంది.
పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాఘవ్ చద్దాకు ఆ రాష్ట్ర రాజకీయాలపై మంచి పట్టు ఉంది. జలంధర్‌తో ఆయనకు కుటుంబ సంబంధాలు కూడా ఉన్నాయి. అమృత్‌సర్, లుధియానా, జలంధర్ వంటి నగరాల్లో పార్టీ ప్రభావాన్ని పెంచేందుకు, అలాగే వ్యాపార వర్గాలు, పట్టణ మధ్యతరగతి ఓటర్లను ఆకట్టుకునేందుకు చద్దాను బీజేపీ వినియోగించుకోవాలని భావిస్తోంది.
ప్రస్తుతం పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాఘవ్ చద్దాకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.







