కాంగ్రెస్ పార్టీ ఎడపల్లి మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను శుక్రవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా జానకంపేటలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పార్టీ శ్రేణులు, ఆయన ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ప్రార్థించారు.

మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన నాయకులు, జైతాపూర్ ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు నాగుల రాజుగౌడ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. భవిత పాఠశాల విద్యార్థులకు కూడా పండ్లు పంపిణీ చేశారు.

ఎడపల్లి నుండి పులి శ్రీనివాస్ స్వగ్రామమైన ఏఆర్పి క్యాంప్ వరకు అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏఆర్పి క్యాంప్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో నాగుల రాజుగౌడ్ సహా 52 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. స్థానిక సర్పంచ్ పురమళ్ళ వినోద్ ఆధ్వర్యంలో అక్కడ కేక్ కటింగ్, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాగుల రాజుగౌడ్, పురమళ్ళ వినోద్, జానకంపేట మైనారిటీ అధ్యక్షుడు తాహర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో పులి శ్రీనివాస్ చురుగ్గా ఉంటారని కొనియాడారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆయన చేస్తున్న సేవలను వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.