టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ లేని ఒక 24 ఏళ్ల యువకుడు నిరంతర నిరాకరణలను ఎదుర్కొన్నా, కేవలం రెండేళ్ల వ్యవధిలో తన జీతాన్ని నెలకు రూ.25,000 నుండి ఏకంగా రూ.22 లక్షల వార్షికంగా పెంచుకున్న కథ ఈమధ్య సోషల్ మీడియా, కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సాధారణ కళాశాల నుంచి BBA పూర్తి చేసిన ఈ యువకుడు మొదట క్యాట్ పరీక్ష రాసి మంచి మేనేజ్‌మెంట్ కళాశాలలో ప్రవేశం పొందాలని నిర్ణయించుకున్నాడు. కానీ సమయం వృథా చేయకూడదనే ఉద్దేశంతో డేటా సైన్స్ వైపు మళ్లించాడు. యూట్యూబ్, ఇతర డిజిటల్ వేదికల ద్వారా స్వయంగా కోడింగ్, డేటా ఎనలిటిక్స్ నేర్చుకున్నాడు.

టెక్ డిగ్రీ లేకపోవడం వల్ల 90 శాతానికి పైగా కంపెనీలు అతని ప్రొఫైల్‌ను తిరస్కరించాయి. 700కు పైగా కంపెనీలకు దరఖాస్తు చేసుకున్న తర్వాత, నెలకు రూ.25,000 జీతంతో ఒక స్టార్టప్‌లో ఉద్యోగం లభించింది. కానీ మూడు నెలల్లోనే ఆ ఉద్యోగం పోయింది. రెండు నెలల జీతం కూడా బకాయి పడింది.

ఈ సవాళ్లను అధిగమించి, మళ్లీ లింక్డ్‌ఇన్‌లో దరఖాస్తులు చేస్తూ నాలుగు నెలల తర్వాత రూ.6 లక్షల ప్యాకేజీతో మరో ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం అమెరికా ఎంఎన్‌సీలో రూ.22 లక్షల వార్షిక వేతనంతో ఆఫర్ లెటర్ అందుకున్నాడు.