శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం వేదికగా శనివారం విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. ‘స్కైరూట్ ఏరోస్పేస్’ సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ ప్రయోగంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ విజయానికి సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా శాస్త్రవేత్తలతో ఫోన్లో మాట్లాడారు.
ఈ చారిత్రాత్మక ప్రయోగంలో జబర్దస్త్ కమెడియన్ సత్యశ్రీ సోదరి కీర్తి శ్రీ ఏవియానిక్స్ ఇంజనీర్ మరియు ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్ & టెస్ట్ ఇంజనీర్‌గా పనిచేశారు. తన సోదరి సాధించిన ఈ ఘనతపై సత్యశ్రీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కీర్తి శ్రీ రాకెట్ ప్రయోగానికి ముందు నిర్వహించిన పరీక్షలు, కఠోర శ్రమను గుర్తుచేస్తూ సత్యశ్రీ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
చిన్నతనంలో నక్షత్రాలను కుతూహలంతో చూసిన కీర్తి శ్రీ, ఇప్పుడు అంతరిక్ష ప్రయాణంలో భాగస్వామి కావడం గర్వంగా ఉందని సత్యశ్రీ పేర్కొన్నారు. విక్రమ్-1 రాకెట్‌పై కీర్తి శ్రీ తన పేరును సంతకం చేసిన క్షణం ఎంతో ప్రత్యేకమైనదని ఆమె తెలిపారు. కీర్తి శ్రీ తనిఖీ చేసిన ప్రతి తీగ, పరీక్షించిన ప్రతి వ్యవస్థ మిషన్ ఆగమన్‌ను విజయవంతం చేయడంలో కీలకమయ్యాయని సత్యశ్రీ వివరించారు.
జబర్దస్త్ వేదికగా గుర్తింపు పొందిన సత్యశ్రీ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారు. వీరి తల్లి కూడా గతంలో నటిగా పనిచేశారు. తమ తమ రంగాల్లో రాణిస్తున్న అక్కాచెల్లెళ్లను పలువురు అభినందిస్తున్నారు.







