విజయవాడ ఇంద్రకిలాద్రి శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు డిజిటల్ లడ్డూ ఏటీఎం మిషన్లను సిద్ధం చేస్తున్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల సమయంలో భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండకుండా, వేగంగా ప్రసాదాన్ని పొందేందుకు ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు.
ఈ ప్రక్రియలో భాగంగా భక్తులు ముందుగా ఆన్‌లైన్ ద్వారా లడ్డూలను బుక్ చేసుకోవాలి. బుకింగ్ పూర్తయ్యాక భక్తుల మొబైల్ ఫోన్‌కు ఒక ఓటీపీ (OTP) వస్తుంది. ఏటీఎం మిషన్ వద్దకు వెళ్లి ఆ ఓటీపీని నమోదు చేయగానే లడ్డూ ప్రసాదం నేరుగా అందుతుంది. ఒక్కో వ్యక్తి ఒకేసారి ఒకటి నుంచి ఆరు లడ్డూల వరకు తీసుకునే వెసులుబాటును అధికారులు కల్పించారు.
దసరా ఉత్సవాల నాటికి మొత్తం 6 లడ్డూ ఏటీఎం మిషన్లను ఆలయంలో ఏర్పాటు చేయనున్నారు. సాధారణంగా దసరా సమయంలో 30 లక్షల నుంచి 35 లక్షల వరకు లడ్డూలు అమ్ముడవుతుంటాయి. ఈ ఏడాది భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో, రద్దీని తగ్గించి ప్రసాద విక్రయాలను వేగవంతం చేయడానికి ఈ సాంకేతికత ఉపయోగపడనుంది.








