కృత్రిమ మేధస్సు (AI) మరియు డీప్‌ఫేక్ సాంకేతికతను వాడుకుని సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలపై భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) మరియు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) శుక్రవారం ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా 'బాస్ స్కామ్' పేరుతో కంపెనీలను, పెట్టుబడిదారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఆర్థిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.
నేరగాళ్లు AI సాయంతో సీఎండీలు, సీఈఓల గొంతును క్లోన్ చేయడం లేదా డీప్‌ఫేక్ వీడియోలను సృష్టించడం వంటి పనులకు పాల్పడుతున్నారు. వాట్సాప్, ఈ-మెయిల్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఉన్నతాధికారులలా నటించి, అత్యవసరమని నమ్మించి నిధులను బదిలీ చేయాలని ఫైనాన్స్ విభాగాలపై ఒత్తిడి తెస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మాల్వేర్ ఫైళ్లను పంపి ఉద్యోగుల పరికరాలను హ్యాక్ చేసి, వారి ఖాతాల నుంచే నకిలీ చెల్లింపు ఆదేశాలను పంపుతున్నట్లు సెబీ గుర్తించింది.
మరోవైపు, పెట్టుబడిదారుల కోసం ఎన్‌ఎస్‌ఈ ప్రత్యేక సూచనలు చేసింది. ఫిషింగ్ లింకులు, నకిలీ వెబ్‌సైట్లు, క్లోన్ ట్రేడింగ్ యాప్‌లు మరియు సోషల్ మీడియా గ్రూపుల ద్వారా తప్పుడు స్టాక్ సిఫార్సులు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించింది. ట్రేడింగ్ కోసం కేవలం అధికారిక వెబ్‌సైట్లు, యాప్‌లను మాత్రమే వాడాలని, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని స్పష్టం చేసింది.
పెట్టుబడిదారులు తమ వ్యక్తిగత వివరాలను, ముఖ్యంగా ఓటీపీ (OTP) లేదా లాగిన్ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని ఎన్‌ఎస్‌ఈ కోరింది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించాలని, ఆర్థిక లావాదేవీల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని నియంత్రణ సంస్థలు సూచించాయి.








