హైదరాబాద్‌లోని కోకాపేటలో హరే కృష్ణ మూవ్‌మెంట్ నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్రకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శ్రీ జగన్నాథ, బలదేవ, సుభద్రల దివ్య విగ్రహాలను రథంపై ఉంచి, భక్తిపూర్వక వాతావరణంలో ఈ ఊరేగింపును కొనసాగించారు.
ఈ రథయాత్రలో 500 మందికి పైగా భక్తులు కలిసి రథాన్ని లాగారు. భక్తులందరిలో ఐక్యతను, అంకితభావాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం సాగింది. ఊరేగింపులో భక్తి గీతాలు, ప్రార్థనలు, వేద సాహిత్యం పంపిణీ వంటి కార్యక్రమాలను నిర్వహించారు.
సాంస్కృతిక ప్రదర్శనలు, బాణసంచా కాల్పులతో కోకాపేట ప్రాంతం సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో 20,000 మందికి పైగా భక్తులకు దొన్నె ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
చివరగా శ్రీమాన్ సత్య గౌర చంద్ర దాస ప్రభుజీ అందించిన ప్రత్యేక ప్రవచనం, మెగా కీర్తనలతో ఈ రథయాత్ర కార్యక్రమం ముగిసింది.








