ప్రశ్నపత్రాల లీకేజీలు, అక్రమ నిర్బంధాల వంటి అన్యాయాలకు వ్యతిరేకంగా జులై 20న పార్లమెంట్ ముట్టడి చేపట్టాలని సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమాన్ని దేశానికి ‘రెండో స్వాతంత్య్ర ఉద్యమం’గా ఆయన అభివర్ణించారు.
ప్రస్తుతం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వాంగ్‌చుక్, తన భార్య గీతాంజలి జే. ఆంగ్మో ద్వారా ఈ సందేశాన్ని పంపారు. తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ఈ చేతిరాత సందేశాన్ని పోస్టు చేశారు. అన్యాయం నుంచి విముక్తి, భయం నుంచి స్వేచ్ఛ పొందేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
జంతర్‌మంతర్ నిరసన స్థలం నుంచి తనను బలవంతంగా తీసుకెళ్లి, ఇష్టానికి విరుద్ధంగా ఆస్పత్రిలో ఉంచారని వాంగ్‌చుక్ గతంలో ఆరోపణలు చేశారు. తాజాగా పంపిన సందేశంలో కూడా తన అక్రమ నిర్బంధం గురించి ఆయన ప్రస్తావించారు. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి నుంచే గీతాంజలి ద్వారా ఈ సందేశాన్ని పంపిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.







