రాష్ట్రంలోని తీరప్రాంతాల్లో బీచ్ బార్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే విశాఖ, చీరాలలో వీటిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ బీచ్ బార్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక ప్రణాళికలను సిద్ధం చేసింది.

విశాఖపట్నంలో ఆర్కే బీచ్ సమీపంలో ఒకటి, తొట్లకొండ-రుషికొండ మధ్యలో మరొకటి ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదించింది. చీరాలలో కూడా బీచ్ బార్లకు అనువైన రెండు ప్రాంతాలను అధికారులు గుర్తించారు. త్వరలో విడుదల చేయనున్న కొత్త మద్యం విధానంలో వీటిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయిన తర్వాత, 2027 జనవరి నాటికి శ్రీకాకుళం నుండి తిరుపతి జిల్లా వరకు ఉన్న తీరప్రాంతాల్లో బీచ్ బార్లను విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి లైసెన్సుల కేటాయింపు కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది.