పెట్రోల్, డీజిల్ మరియు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై విండ్ ఫాల్ ట్యాక్స్‌ను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు ఆగస్ట్ 3వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ముడి చమురు ధరలు మరియు ఎగుమతి మార్జిన్ల ఆధారంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రభుత్వం ఈ సుంకాలను సమీక్షిస్తుంది.
తాజా నిర్ణయంతో డీజిల్ ఎగుమతి సుంకం లీటరుకు రూ.15.50 నుంచి రూ.24కు పెరిగింది. అలాగే పెట్రోల్ ఎగుమతిపై సుంకాన్ని లీటరుకు రూ.2.50 నుంచి రూ.3.50కి ప్రభుత్వం సవరించింది. రిఫైనరీలు విదేశాలకు ఇంధనాన్ని ఎగుమతి చేయడం ద్వారా పొందే అదనపు లాభాలపై ఈ ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తారు.
ఈ పన్నుల పెంపు కేవలం ఇంధనాన్ని విదేశాలకు ఎగుమతి చేసే సంస్థలపై మాత్రమే ప్రభావం చూపుతుంది. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవు. సోమవారం ఉదయం ఇంధన కంపెనీలు ప్రకటించిన ధరల ప్రకారం, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.115.73, డీజిల్ రూ.103.82 వద్ద ఉన్నాయి. విశాఖపట్నంలో పెట్రోల్ రూ.116.64, డీజిల్ రూ.104.34గా కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగి రిఫైనర్లు అధిక లాభాలు పొందుతున్నప్పుడు ప్రభుత్వం విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ, ప్రభుత్వం ఈ ఎగుమతి సుంకాలను పెంచడం గమనార్హం.








