స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రత్యేక విభాగాల్లో ఉన్న 1,538 జూనియర్ అసోసియేట్ బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేసేందుకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను చేపట్టింది. ఈ పోస్టుల కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే, అయితే విధుల్లో చేరే సమయానికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండటంతో పాటు ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 7 నుంచి ఆగస్టు 27, 2026 వరకు అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఫోటోగ్రాఫ్స్, సంతకాలతో పాటు అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులు రూ.750 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉండగా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి రుసుము లేదు.

ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలతో పాటు భాషా ప్రావీణ్యత పరీక్షను నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.46,000 ప్రారంభ వేతనం లభిస్తుంది.