అయిజ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో సెర్ప్ డైరెక్టర్ గోపాల్‌రావు పంచాయతీ కార్యదర్శులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా మరణించిన వ్యక్తుల పింఛన్ సొమ్మును వారి కుటుంబ సభ్యులు ఏటీఎం కార్డుల ద్వారా డ్రా చేస్తున్నట్లు గుర్తించామని, అటువంటి మొత్తాలను వెంటనే రెవెన్యూ రికవరీ చేయాలని ఆయన ఆదేశించారు.
ఈ క్రమంలో ఉత్తనూరు గ్రామంలో అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. మరణించిన వారి పింఛన్ డబ్బులను ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకుంటున్న మూడు కుటుంబాలను అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ భాస్కర్‌తో పాటు పలువురు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
మరోవైపు ఉమ్మడి జిల్లాలో మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి శ్రీనివాస్‌గౌడు తెలిపారు. పీజీలో 55 శాతం మార్కులతో పాటు బీఎడ్ అర్హత ఉన్న అభ్యర్థులు, ఈ నెల 20లోగా జడ్చర్లలోని ఆర్‌సీఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
గట్టు మండలంలో భారత్‌మాల రోడ్డు కనెక్టివిటీ కోసం చేపట్టిన నిరసన దీక్షలు గురువారానికి 151వ రోజుకు చేరుకున్నాయి. రాయాపురం స్టేజీ వద్ద వంతెన నిర్మించాలని, రవాణా సౌకర్యాలు కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అటు గద్వాల వ్యవసాయ మార్కెట్‌కు 1,945 క్వింటాళ్ల వేరుశనగ రాగా, క్వింటాల్‌కు గరిష్టంగా రూ.8,000 ధర లభించింది.





