రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగంలో 95 శాతం భూసేకరణ పూర్తయ్యిందని, కాబట్టి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేందుకు కేంద్ర కేబినెట్ అనుమతి ఇప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. జూలై 14, 2026న ఢిల్లీలో జరిగిన భేటీలో జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఈ విషయాన్ని ప్రస్తావించారు.

రోడ్డు పనులు రెండు వైపులా ఒకేసారి ప్రారంభమైతే నిర్మాణం త్వరగా పూర్తవుతుందని, ఖర్చు కూడా తగ్గుతుందని సీఎం గడ్కరీకి వివరించారు. అలాగే, ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నట్లుగా హైదరాబాద్ నుంచి ఆంధ్రా రాజధానికి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తామని, దీనికి అవసరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని కోరారు.

భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్‌కు 12 వరుసల రహదారి మంజూరైతే హైదరాబాద్-విజయవాడ మధ్య దూరం 100 కిలోమీటర్లు తగ్గుతుందని సీఎం తెలిపారు. దీంతో హైదరాబాద్ సిటీ నుంచి బందరు పోర్టుకు సరకు రవాణా వేగవంతమవుతుందని స్పష్టం చేశారు.

మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్‌కు అటవీ శాఖ అనుమతులు ఇప్పించాలని, ఈ మార్గంలో నల్లమల అభయారణ్యం, శ్రీశైలం ఆలయం, జలాశయాలు ఉంటాయని వివరించారు. అలాగే, హైదరాబాద్-మంచిర్యాల రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా ఆరు వరుసల జాతీయ రహదారికి అనుమతి ఇవ్వాలని, దీనికి కావాల్సిన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు కె.రామకృష్ణారావు, స్పెషల్ సెక్రటరీ కో ఆర్డినేషన్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.