నగరంలోని చెరువుల పునరుజ్జీవన కార్యక్రమాలతో హైదరాబాద్ రూపురేఖలు మారుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చెరువులకు జీవం పోస్తూ, రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్తును అందించేందుకు హైడ్రా చేస్తున్న కృషి ఎంతో సంతృప్తినిస్తోందని ఆయన తెలిపారు.
ఉప్పల్ నల్ల చెరువు పునరుద్ధరణ కోసం హైడ్రా అధికారులు, సిబ్బంది అహర్నిశలు శ్రమించారని సీఎం ప్రశంసించారు. చెరువులను కాపాడటం అంటే కేవలం నీటి వనరులను సంరక్షించడమే కాదని, అది భావి తరాల భవిష్యత్తును భద్రపరచడమేనని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి అంగుళం ప్రజా ఆస్తిని కాపాడుకుంటూ, చెరువులను కంటికి రెప్పలా సంరక్షించే దిశగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం వెల్లడించారు. నగరంలోని జలవనరుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.








