ఇంజనీరింగ్ విద్యార్థులను, ఇంజనీర్లను 'క్రిమినల్ వేస్ట్' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబోధించడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ఆదివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న ఇంజనీర్లను కించపరిచేలా ముఖ్యమంత్రి మాట్లాడటం సరికాదని కేటీఆర్ పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మౌనం వహించడం అంటే, ఆ వ్యాఖ్యలను సమర్థించడమేనని కేటీఆర్ లేఖలో స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు, ఆయనను రాష్ట్రానికి పంపిన రాహుల్ గాంధీ కూడా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో యూనివర్సిటీ విద్యార్థులను 'బీరు బిర్యానీ బ్యాచ్' అని రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
యువత, విద్యార్థులు, అధ్యాపకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. యువతతో పెట్టుకున్న గత ప్రభుత్వాలకు ఎదురైన పరిణామాలను రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు. విద్యార్థులకు, గురువులకు, ఇంజనీర్లకు రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ హామీల పేరుతో యువతను మోసం చేసిందని, అసలైన 'క్రిమినల్ వేస్ట్' కాంగ్రెస్ పార్టీయేనని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ యువత ఈ వ్యాఖ్యలను గమనిస్తోందని, సరైన సమయంలో తగిన సమాధానం చెబుతుందని ఆయన లేఖలో హెచ్చరించారు.








