సైబర్ క్రైమ్ డీసీపీగా పనిచేస్తున్న అర్వింద్ బాబును విధుల్లోంచి తప్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించిన మోర్ఫ్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణలపై డీసీపీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఈ నిర్ణయంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డీసీపీని బాధ్యతల నుంచి తొలగించడం ద్వారా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపించింది. ప్రధానమంత్రిపై హానికరమైన పోస్టులు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, కేసు నమోదు చేసిన అధికారిపైనే వేటు వేయడం వెనుక రాజకీయ కోణం ఉందని ఆ పార్టీ విమర్శించింది.
ప్రభుత్వం డీసీపీని బాధ్యతల నుంచి తప్పించినప్పటికీ, ప్రధానమంత్రిపై అభ్యంతరకరమైన వీడియోలను ప్రచారం చేసిన వారిపై ఇప్పటివరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోలేదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.







