వ్యాపారిని బిల్లు తగ్గించమని కానిస్టేబుల్ గన్‌తో బెదిరించి హల్‌చల్ సృష్టించిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...వివేక్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. వివేక్ బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఎల్‌ఎఫ్ వద్ద ఉన్న మెమోస్ డిలైట్ అనే ఫుడ్ కోర్టు వద్దకు వెళ్లాడు.
అక్కడ ఫుడ్ తీసుకున్న కానిస్టేబుల్ బిల్లు ఎక్కువ కావడంతో తగ్గించమని కోరాడు. దానికి వ్యాపారి నిరాకరించడంతో గన్ తీసిన కానిస్టేబుల్ తగ్గించమని బెదిరించాడు. దీంతో వ్యాపారి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విషయం పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి, గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారిని బెదిరించిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయనున్నట్లు తెలిసింది.

