పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు జిల్లాకు సాగునీరు అందకుండా అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఆర్డీఎస్ (RDS) నుంచి అనుమతి లేకుండా నీటిని తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వీటిని అడ్డుకోవాల్సిన బాధ్యత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులపై ఉందని ఆయన పేర్కొన్నారు.
ఆల్మట్టి ప్రాజెక్టు వద్ద నీటి నిల్వ సామర్థ్యాన్ని 300 టీఎంసీలకు పెంచేందుకు ఎత్తును పెంచుతున్నారని శ్రీనివాస్ గౌడ్ వివరించారు. ఈ అంశాన్ని న్యాయపరంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. తెలంగాణకు నీటిని నిలిపివేసేలా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్ అధికారిని సలహాదారుగా నియమించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుందని ఆయన విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన చర్యల వల్ల జిల్లాలో సాగు విస్తీర్ణం రెండు లక్షల ఎకరాల నుంచి పది లక్షల ఎకరాలకు పెరిగిందని ఆయన గుర్తు చేశారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతిరోజూ కృష్ణా నీటిని ఇంటింటికి అందించామని, గతంలో 14 రోజులకు ఒకసారి వచ్చే తాగునీటి సమస్యను పరిష్కరించామని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.






