మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో ఆదివారం బీఆర్ఎస్ యువ నాయకులు, కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో యువతకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్, గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని, ఈ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. అదే సమయంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త గ్రామ స్థాయిలో సైనికుడిలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని సూచించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలపై పోరాడే వారికి పార్టీ అండగా ఉంటుందని, కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యత లభిస్తుందని ఆయన భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల ప్రీతి రెడ్డితో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.







