జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలను ఒక అఖండ విజయంగా అభివర్ణిస్తూ, యువత తమ పోరాట పటిమను కొనసాగించాలని లేఖలో కోరారు. గత 12 ఏళ్లుగా వ్యవస్థలను, వార్తా మాధ్యమాలను కేంద్రం తన ఆధీనంలో ఉంచుకుందని, ఈ సమయంలో ప్రజల వ్యతిరేకతను చూపించడంలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు. అయితే, నిరసనల విషయంలో ఒకే రకమైన ప్రణాళికను పాటించడం వల్ల ప్రజలకు అవి అలవాటుగా మారి, ప్రభావం తగ్గే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఢిల్లీలో కేంద్రీకృత పోరాటాలు కాకుండా, ఎవరి రాష్ట్రాల్లో వారు ఆయా ప్రభుత్వాల విధానాలను ఎండగట్టాలని యువతకు సూచించారు. రాష్ట్ర రాజధానులు, ఇతర నగరాల్లో ఆందోళనలు చేపట్టి సామాన్య ప్రజలను చైతన్యపరచాలని కోరారు. ఈ ఉద్యమాల్లో రాజకీయ అవగాహన ఉన్న రిటైర్డ్ అధికారులు, ప్రొఫెసర్లు, లాయర్లు వంటి పెద్దలను ప్రత్యేక అతిథులుగా చేర్చుకోవడం ద్వారా అనుభవం, సంయమనం తోడవుతాయని పేర్కొన్నారు.

విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి వంటి రంగాలపై యువత క్షుణ్ణంగా అవగాహన పెంచుకోవాలని లేఖలో సూచించారు. దేశంలో వికేంద్రీకరణ జరగాలని, రాష్ట్రాలకు పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలని డిమాండ్ చేశారు.

దేశంలోని రెండు ప్రధాన జాతీయ పార్టీలను దూరంగా ఉంచి, యువత తమ భవిష్యత్తు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ నిరసనలను అంతర్జాతీయ పత్రికల్లో రిపోర్ట్ చేయాలని, అన్ని రాష్ట్రాల్లో అలజడి సృష్టించడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు.