చండూరు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన అభివృద్ధి సర్వసభ్య సమావేశానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లంచాలు తీసుకుంటున్న అధికారుల పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనకు పదిసార్లు ఎమ్మెల్యేగా ఉండాలనే ఆశ లేదని, ప్రజలు ఇచ్చిన రెండు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటానని ఆయన పేర్కొన్నారు.

సమావేశంలో 17 శాఖల అధికారులు మండల అభివృద్ధి పనుల వివరాలను ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, ఉద్యానవన శాఖల అధికారులతో ఆయిల్ ఫామ్ సాగుపై రాజగోపాల్ రెడ్డి చర్చించారు. మునుగోడు నియోజకవర్గాన్ని తెలంగాణలోనే అత్యధిక ఆయిల్ ఫామ్ సాగు చేసే ప్రాంతంగా మార్చాలని, ఇందుకోసం రైతులకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రస్తుత ఆహారంలో కల్తీ పెరిగిపోయిందని, ఆహారం ఔషధంగా మారాలంటే సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మళ్లాలని ఆయన సూచించారు. ప్రతి గ్రామం నుంచి సేంద్రియ సాగు చేసే రైతులను ఎంపిక చేసి, వారి ద్వారా ఇతరులను ప్రోత్సహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సేంద్రియ పంటలకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే బాధ్యత తనదని, మునుగోడు సేంద్రియ ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడమే తన లక్ష్యమని ఆయన వెల్లడించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మండల ప్రత్యేక అధికారి కె. నాగమల్లేశ్వరరావు, ఎంపీడీఓ బండారు యాదగిరితో పాటు వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచులు పాల్గొన్నారు.