హిట్లర్ నాకు ఆదర్శం అని పదేపదే చెప్పుకుంటున్న సిఎం రేవంత్ రెడ్డి కి హిట్లర్‌కు పట్టిన గతే పడుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు పేర్కొంటూ ఐరోపాలో హిట్లర్ పేరు ఎత్తితే ఎలా నిషేధించారో రానున్న రోజులలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పేరు చెప్పితే ప్రజలు అలాగే నిషేధించే రోజు వస్తుందని.. హిట్లర్ మాదిరిగానే రేవంత్ రెడ్డికి పతనం తప్పదని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుతోపాటు ఎస్‌ఐఆర్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటించగానే ఆంధ్రావాళ్లు రాజీనామా చేశారని తెలంగాణ ఆగిపోవడంతో తెలంగాణ వాళ్లు రాజీనామా చేయాలని అప్పటి
టిఆర్‌ఎస్ నాయకులం రాజీనామా చేశామని కాని రేవంత్ రెడ్డి జిరాక్స్ కాపీలు ఇచ్చి రాజీనామా చేశారన్నారు. జై తెలంగాణ అనని.. తెలంగాణ కోసం త్యాగం చెయ్యని వ్యక్తి ఈరోజు తెలంగాణకు ముఖ్యమంత్రి అవ్వడం దురదృష్టకరం అన్నారు. ఎలక్షన్ ముందు అన్ని పంటలకు.. ఆ తరువాత వడ్లకు.. ఏడాది తర్వాత సన్నాళ్లకే బోనస్ అంటూ 33 రకాలకు బోనస్ ఇస్తామని ప్రకటించి కేవలం 7 రకాలకే బోనస్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ను బోగస్ గా మార్చారన్నారు. ప్రజా సమస్యలపై నిలదీస్తే సీఎం రేవంత్ రెడ్డి పాఠశాల విద్యార్థుల ప్రోగ్రాంలో నాఎత్తు గురించి చిల్లర మాటలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. నా ఎత్తుతో నీకేం పని అంటూ రేవంత్‌ను ప్రశ్నించారు. ఎగ్గొట్టిన పథకాలపై.. చేస్తున్న స్కాములపై ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని.. నీ మెడలు మంచి తీరుతాం అన్నారు.

