సీఆర్‌ఎస్-24 (సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్) నివేదిక ప్రకారం ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో మొత్తం 86,288 జననాలు నమోదయ్యాయి. ఇదే కాలంలో 19,605 మరణాలు సంభవించగా, 198 శిశు మరణాలు మరియు 369 మృత శిశు జననాలు (నిర్జీవ పుట్టుక) నమోదైనట్లు నివేదిక పేర్కొంది.
లింగ నిష్పత్తిని పరిశీలిస్తే, ఈ ఐదు జిల్లాల్లో మహిళా జననాల వాటా 45.7 శాతం నుంచి 48.0 శాతం మధ్య ఉంది. పురుష జననాల వాటా 52 నుంచి 54 శాతం మధ్య నమోదైంది. ఇందులో నాగర్‌కర్నూల్ జిల్లాలో మగశిశువుల జననాల శాతం అత్యధికంగా 54.30 శాతంగా ఉంది.
గత 2022 సంవత్సరంతో పోలిస్తే ఆడపిల్లల జననాల శాతం 0.68 శాతం తగ్గడం గమనార్హం. ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయని నివేదిక స్పష్టం చేస్తోంది.



