E20 ఇంధనంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెరదించారు. దేశంలోని పెట్రోల్ బంకుల్లో E20 అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఇథనాల్ కలపని 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్ కావాలనుకునే వారికి ఆ అవకాశం ఉంటుందని, అయితే అందుకు అదనపు ధర చెల్లించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఇథనాల్ కలపడం వల్ల వాహనాల ఇంజన్లు పాడవుతాయనే వార్తల్లో నిజం లేదని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు అలాంటి సమస్యలేవీ నమోదు కాలేదని ఆయన తెలిపారు. వాహనదారుల ఆందోళనలను తొలగించేందుకు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో ఇంధన నాణ్యత తనిఖీలను ముమ్మరం చేశాయి.
ఐఐటీ కాన్పూర్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన పరిశోధకుడు ధృవ రాజ్ కర్ణా కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. విస్తృత పరిశోధనల అనంతరం, E20 ఇంధనం వల్ల ఇంజన్లకు నష్టం వాటిల్లడం లేదా తుప్పు పట్టడం వంటి సమస్యలు తలెత్తవని ఆయన స్పష్టం చేశారు. వాహన మైలేజీలో కూడా ఎలాంటి ప్రతికూల మార్పులు ఉండవని, మైలేజీ అనేది వాహన నిర్వహణ, రోడ్ల పరిస్థితి మరియు డ్రైవింగ్ విధానంపైనే ఆధారపడి ఉంటుందని పరిశోధకులు వివరించారు.
ఈ నేపథ్యంలో, ఇంధన నాణ్యతపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా పెట్రోల్ బంకుల్లో లేదా కస్టమర్ కేర్ ద్వారా తెలియజేయాలని చమురు సంస్థలు కోరాయి. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, వాహనదారులు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు.







