బీఆర్‌ఎస్ సీనియర్ నాయకురాలు గండ్ర జ్యోతి తన ఓటు హక్కును భూపాలపల్లి నియోజకవర్గం నుంచి హనుమకొండకు బదిలీ చేయించుకున్నారు. ఈ మేరకు ఆమె ఎస్‌ఐఆర్‌ వెరిఫికేషన్ కోసం అవసరమైన పత్రాలను సమర్పించారు. గతంలో ఆమె భర్త గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ, ప్రస్తుతం ఆమె హనుమకొండను ఎంచుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

గండ్ర జ్యోతి గతంలో 2019 వరకు హన్మకొండలోనే ఓటరుగా ఉన్నారు. ఆ తర్వాత వరంగల్ రూరల్ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో, నిబంధనల మేరకు తన ఓటును శాయంపేట మండలం మందారిపేటకు మార్చుకున్నారు. తాజా పరిణామాల్లో మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఆయన కుమారుడు గౌతమ్ భూపాలపల్లిలో ఓటు నమోదు చేసుకోగా, జ్యోతి మాత్రం హనుమకొండను ఎంచుకోవడం గమనార్హం.

త్వరలో జరగనున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవిని దక్కించుకోవాలనే లక్ష్యంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 2005లో హన్మకొండ 3వ డివిజన్ నుంచి గెలిచిన జ్యోతి, అప్పట్లోనే మేయర్ పదవి కోసం ప్రయత్నించారు. ఇప్పుడు మళ్లీ అదే పీఠంపై కన్నేయడంతో పాటు, హనుమకొండ జిల్లాలో పార్టీ అప్పగించే ఏ బాధ్యతకైనా సిద్ధమని ఆమె సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం.

మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే హనుమకొండ మహిళా కోటాలోకి వచ్చే అవకాశం ఉందని, అందుకే ఆమె ముందుగానే అక్కడ ఓటు నమోదు చేసుకున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సీనియర్ నాయకుడు మధుసూదనాచారికి చెక్ పెట్టే వ్యూహంలో భాగంగా కూడా గండ్ర దంపతులు ఈ అడుగు వేసి ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మేయర్ పదవి లేదా భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్ లక్ష్యంగా గండ్ర దంపతులు వేస్తున్న ఈ అడుగులు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.