వనపర్తి జిల్లాలో వానకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా తగిన వర్షాలు కురవక మెట్ట పైర్ల సాగు కేవలం 5 శాతానికే పరిమితమైంది. జిల్లా వ్యాప్తంగా లక్షా 20 వేల ఎకరాల్లో మెట్ట పంటలు సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 15 వేల ఎకరాల్లో మాత్రమే విత్తనాలు వేశారు. అప్పుడప్పుడు పడిన చినుకులకు కొందరు సాగు చేయగా, మొలకెత్తక రైతులు అవస్థలు పడుతున్నారు.
జిల్లాలో మొత్తం 15 మండలాలు ఉండగా, అందులో 11 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. గోపాల్‌పేట, పెద్దమందడి, శ్రీరంగాపురం, పాన్‌గల్, పెబ్బేరు, కొత్తకోట, వనపర్తి, మదనాపురం, అమరచింత, ఆత్మకూరు, ఏదుల మండలాల్లో వర్షాలు సరిపోవడం లేదు. రేవల్లి, వీపనగండ్ల మండలాల్లో మాత్రమే అధిక వర్షపాతం నమోదు కాగా, మిగిలిన చోట్ల ఆకాశం మేఘాలతో ఊరిస్తున్నా చిరుజల్లులకే పరిమితమవుతోంది.
కనీసం 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే తప్పా ఆరుతడి పంటలు వేసుకునే అవకాశం లేదని అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 3.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయాల్సి ఉండగా, వరి సాగు 2 లక్షల ఎకరాల్లో అంచనా ఉంది. అయితే మక్క, పత్తి, జొన్న, కందులు వంటి పంటల సీజన్ గడుస్తున్నా వర్షాల జాడ లేక రైతులు దిగులు చెందుతున్నారు.
వ్యవసాయ శాఖ అధికారులు వర్షాలు గ్యారంటీ లేనందున ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని సూచిస్తున్నారు. వారం రోజులు వానల్లేకుంటే పీఆర్‌జీ 176 రకం కంది విత్తనాలను వేయాలని, ఈ రకం 130 రోజుల్లో చేతికి వస్తుందని, దీనిని సబ్సిడీపై అందిస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15 వరకు వర్షాకాల సీజన్‌లో మార్పులు అనివార్యమని, అప్పటి వరకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
పెద్దమందడి మండలం దొడగుంటపల్లికి చెందిన రైతు ఎం.రమేశ్ మాట్లాడుతూ 45 రోజులుగా వర్షం జాడ లేదని, మక్కల సీజన్ వెనక్కి అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలుకు తీసుకున్న భూమిని పొతం చేసి పెట్టుకున్నా ఉపయోగం లేదని, ఇప్పుడు వర్షం వచ్చినా విత్తడం కష్టమేనని రైతులు వాపోతున్నారు.






