ప్రపంచ చరిత్రలో సామ్రాజ్యాలు పతనమైన ప్రతిసారీ కరెన్సీ విలువ పడిపోయిందని, అటువంటి సమయాల్లో బంగారం తన విలువను నిలబెట్టుకుందని ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుడు రాబర్ట్ కియోసాకి విశ్లేషించారు. ప్రభుత్వాలు అపరిమితంగా కరెన్సీని ముద్రించడం వల్ల ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని ఆయన తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో హెచ్చరించారు. రోమన్, స్పానిష్, బ్రిటిష్ సామ్రాజ్యాల చరిత్రను ఉదాహరణగా చూపుతూ, కరెన్సీ విలువ తగ్గుదల ఆధిపత్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన వివరించారు.
ప్రభుత్వాలు ఎంత డబ్బునైనా ముద్రించగలవు కానీ, బంగారం, వెండిని అలా సృష్టించడం సాధ్యం కాదని కియోసాకి స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం వల్ల సామాన్యుల కొనుగోలు శక్తి క్రమంగా తగ్గుతుందని, ఈ క్రమంలో బంగారం, వెండి నిజమైన సంపదను రక్షించే సాధనాలుగా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా డాలర్ ఆధిపత్యం కూడా క్రమంగా తగ్గుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
బంగారం, వెండిని రాత్రికి రాత్రే ధనవంతులను చేసే పెట్టుబడులుగా చూడకూడదని, ఆర్థిక సంక్షోభాల నుంచి కాపాడే 'ఫైనాన్షియల్ లైఫ్‌బోట్లు'గా భావించాలని ఆయన సూచించారు. కాగితపు కరెన్సీలో మాత్రమే పొదుపు చేయడం వల్ల కాలక్రమంలో విలువ కోల్పోతామని ఆయన హెచ్చరించారు.
ఆర్థిక పరిస్థితులు మరింత క్లిష్టంగా మారకముందే చిన్న మొత్తంలోనైనా వెండి నాణేలు లేదా బంగారం కొనుగోలు చేయడం ప్రారంభించాలని ఆయన తన ఫాలోవర్లకు సూచించారు. ప్రభుత్వాలపై నమ్మకం తగ్గినప్పుడు బంగారం ధరలు పెరగడం అంటే, బంగారం విలువ పెరగడం కాదని, కరెన్సీ విలువ పడిపోవడమేనని ఆయన వివరించారు.








