మహారాష్ట్ర నాసిక్‌లోని ఇందిరా నగర్ ప్రాంతంలో వనసంపద గార్డెన్ సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అమరావతి జిల్లాకు చెందిన వైష్ణవిని, యవత్‌మాల్ జిల్లా ఉమర్‌ఖేడ్ ప్రాంతానికి చెందిన సహిల్ లవహరే కత్తితో దాడి చేసి హత్య చేశాడు. గతంలో ప్రేమించుకున్న వీరిద్దరూ, వైష్ణవి మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో గొడవ పడ్డారు.

ఘటన సమయంలో వైష్ణవి తన కాబోయే భర్తకు ఫోన్ చేసి సహిల్ అక్కడ ఉన్నాడని సమాచారం ఇచ్చింది. దాదాపు 22 నిమిషాల పాటు వారిద్దరి మధ్య జరిగిన వాగ్వాదాన్ని ఆమె కాబోయే భర్త ఫోన్ ద్వారా విన్నాడు. గొడవ తీవ్రరూపం దాల్చడంతో సహిల్ కత్తితో వైష్ణవిపై దాడి చేయగా, ఆమె అక్కడికక్కడే మరణించింది.

హత్య చేసిన తర్వాత నిందితుడు సహిల్, వైష్ణవి కాబోయే భర్తకు ఫోన్ చేసి ఆమె చనిపోయిందని చెప్పాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే విచారణ మొదలుపెట్టారు. హత్య జరిగిన ప్రదేశానికి రెండు కిలోమీటర్ల దూరంలో సహిల్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.