సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం ఇరాక్‌పల్లి గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త హత్య చేశాడు. సయ్యద్ ముల్తాన్ తన భార్య ఇర్ఫానాను కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇర్ఫానా ఆరు నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీ తర్వాత, వారం రోజుల క్రితమే ఆమె తిరిగి భర్త వద్దకు వచ్చింది. అయితే, మళ్లీ గొడవలు మొదలవ్వడంతో ఈ దారుణం చోటుచేసుకుంది.
హత్య చేసిన తర్వాత నిందితుడు ఇర్ఫానా మృతదేహాన్ని గ్రామ సమీపంలోని దర్గా వద్ద పడేశాడు. తెల్లవారుజామున నేరుగా నాగల్‌గిద్ద పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడి వాంగ్మూలం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలు, భార్యపై అనుమానమే హత్యకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని, పూర్తి వివరాలు దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.








