హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా సిక్రోనా ప్రాంతంలో జూలై 29న ఉదయం 9.30 గంటలకు ఈ హత్య జరిగింది. ముఖానికి మాస్క్ ధరించిన ఒక వ్యక్తి ప్రైవేట్ పాఠశాల గేటు వద్దకు వచ్చి ఉపాధ్యాయురాలు సంధ్య గురించి ఆరా తీశాడు. ఆమె బయటకు రాగానే నిందితుడు ఆమెను పక్కకు ఈడ్చుకెళ్లి కత్తితో దాడి చేశాడు.

టీచర్ అరుపులు విన్న పాఠశాల నిర్వాహకుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, నిందితుడు కత్తితో బెదిరించడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అనంతరం నేలపై పడి ఉన్న సంధ్య మెడపై పలుమార్లు కత్తితో పొడిచి, నంబర్ ప్లేట్ లేని బైక్‌పై నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలైన సంధ్యను అల్ ఫలాహ్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అమిత్ అని స్థానికులు గుర్తించగా, అతడు ఆ టీచర్‌ను వేధిస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. పూర్వ విద్యార్థి అయిన అమిత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు పాఠశాల సీసీటీవీలో రికార్డయ్యాయి.