భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని సాంబాయి గూడెం మరియు రామానుజవరం గ్రామాల మధ్య రహదారిపై ఇసుక లారీలు అడ్డంగా నిలవడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పినపాక మండలం గడ్డి గూడెం గ్రామానికి చెందిన వంశీ (33) అనే భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ డైలీ వేస్ కూలీ గడ్డి మందు సేవించాడు. సోమవారం జరిగిన ఈ ఘటనలో అంబులెన్స్ రాలేకపోవడంతో సహోద్యోగులు అతడిని చేతులపై మోసుకుంటూ వచ్చినా ప్రయోజనం లేకపోయింది.

ఇసుక లారీలకు పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో డ్రైవర్లు వాటిని నడి రోడ్డుపైనే నిలిపివేశారు. దీనివల్ల ఇతర వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయి సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సమయంలోనే వంశీ అస్వస్థతకు గురికావడంతో అతడితో పనిచేసే కార్మికులు 108 అంబులెన్స్ సేవల ద్వారా మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.

అయితే రోడ్డు నిండా లారీలు అడ్డంగా ఉండటంతో అంబులెన్స్ అక్కడికి చేరుకోలేకపోయింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న తోటి కార్మికులు వంశీని చేతులపై మోసుకుంటూ ఆసుపత్రి వైపుకు వచ్చారు. ఈ దృశ్యం అక్కడ ఉన్న చూపరులందర్నీ కంటతడి పెట్టించింది. అయినప్పటికీ మణుగూరులోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చే లోపే వంశీ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

ఈ ఘటనపై అధికారుల తీరుపై ఎలాంటి చలనం లేకపోవడం ప్రజలలో అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇసుకపై ఉన్న శ్రద్ధ మనుషుల ప్రాణాలపై ఎందుకు లేదని ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. మానవీయం మంటగలిసిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.