మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా వైకుంఠ్ బోను దర్శకత్వంలో తెరకెక్కిన 'వసుదేవసుతం' సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెయిన్‌బో సినిమాస్ బ్యానర్ పై ధనలక్ష్మి బాదర్ల నిర్మించిన ఈ చిత్రం పూరి ఆలయం నేపథ్యంలో సాగుతుంది. జాన్ విజయ్, మైమ్ గోపి, సురేష్ చంద్ర మీనన్ కీలక పాత్రల్లో నటించారు.

కథ పురుషోత్తమపురిలోని వాసుదేవ ఆలయం చుట్టూ తిరుగుతుంది. ఆలయ చైర్మన్ శర్మను హీరా బంధు చంపి, తన తండ్రిని ఎన్నికల్లో గెలిపించుకుంటాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చిన కృశవ్ (మహేంద్రన్), హీరా బంధు మేనకోడలు భువి (అంబికా వాణి) ప్రేమలో పడతారు. అయితే శర్మ మరణం, కొయిరాతల ప్రదేశంలోని రహస్యం తెలుసుకునే క్రమంలో కృశవ్ జైలు నుంచి తప్పించుకున్న వ్యక్తి అని తెలియడంతో కథ మలుపు తిరుగుతుంది.

మొదటి భాగంలో ఆలయ అధికారం కోసం జరిగే గొడవలు, ప్రేమకథ సాగదీతగా అనిపిస్తాయి. రెండో భాగంలో హీరో ఫ్లాష్ బ్యాక్, అక్క ఎమోషన్ బాగున్నా.. ట్రెజర్ హంట్ కథనం స్పష్టత లేకుండా సాగుతుంది. గరుత్మంతుడు, పాములు వచ్చి కాపాడటం, AI విజువల్స్ వాడకం కథకు ఏ మేరకు సంబంధించినవో అర్థం కాదు. విలన్ గుండెలు బయటకు విసరడం వంటి దృశ్యాలు ఇబ్బంది కలిగిస్తాయి.

సాంకేతికంగా సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించినా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు నిరాశపరుస్తాయి. గ్రీన్ మ్యాట్ వాడకం స్పష్టంగా తెలిసిపోయింది. దేవుడి నేపథ్యంలో వస్తున్న సినిమాల జాబితాలో ఇది కూడా ఒకటిగా మిగిలిపోయింది.