దేశవ్యాప్తంగా ఉన్న 41 రెస్టారెంట్లపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (CCPA) స్వయంగా విచారణ చేపట్టింది. వినియోగదారుల అనుమతి లేకుండానే బిల్లుల్లో సర్వీస్ ఛార్జీలను ఆటోమేటిక్‌గా కలిపి వసూలు చేస్తున్నట్లు జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (NCH)కు అందిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు ప్రారంభమయ్యాయి. చాయోస్, బార్బెక్యూ నేషన్, ఎల్’ఒపెరా ఫ్రెంచ్ బేకరీ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలపై జరిమానాలు విధించినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ‘X’ వేదికగా తెలిపారు.
ఈ రెస్టారెంట్లు అనుసరిస్తున్న విధానం అన్యాయమైన వాణిజ్య పద్ధతి అని సీసీపీఏ నిర్ధారించింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం, 2019లోని సెక్షన్ 2(47) ప్రకారం ఇది నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. 2022 జూలై 4న జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జీని తప్పనిసరిగా వసూలు చేయడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంపై మార్చి 28, 2025న ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, సర్వీస్ ఛార్జీపై సీసీపీఏ మార్గదర్శకాలను కోర్టు సమర్థించింది. చట్టప్రకారం ఈ నిబంధనలను అమలు చేసే పూర్తి అధికారం సీసీపీఏకు ఉందని కోర్టు పేర్కొంది.
నిబంధనలు ఉల్లంఘించిన చాయోస్ (సన్‌షైన్ టీహౌస్ ప్రైవేట్ లిమిటెడ్) సంస్థపై సీసీపీఏ రూ. 50,000 జరిమానా విధించింది. అంతేకాకుండా, వినియోగదారుల నుండి అక్రమంగా వసూలు చేసిన సర్వీస్ ఛార్జీలను తిరిగి చెల్లించాలని ఆ కంపెనీని ఆదేశించింది. భవిష్యత్తులో కూడా ఇటువంటి అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అరికట్టేందుకు చట్టబద్ధమైన చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.







