వర్షాకాలం సాయంత్రం వేళల్లో టీ లేదా కాఫీతో పాటు వేడివేడి పకోడీలు తినడం చాలా మందికి ఇష్టం. సాధారణంగా చేసుకునే ఉల్లిపాయ లేదా చికెన్ పకోడీలకు భిన్నంగా, ఈసారి మష్రూమ్స్ (పుట్టగొడుగులు) ఉపయోగించి రుచికరమైన పకోడీలను ప్రయత్నించండి. బయట స్వీట్ షాప్స్, హోటల్స్‌లో దొరికేలా వీటిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.

ఈ పకోడీ తయారీకి ఒక కప్పు చిన్నగా కట్ చేసిన మష్రూమ్స్, ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ, 4-5 టేబుల్ స్పూన్ల శెనగపిండి, ఒక టేబుల్ స్పూన్ బియ్యప్పిండి అవసరం. వీటితో పాటు అర టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, తగినంత పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, రుచికి సరిపడా కారం, పసుపు, ఉప్పు సిద్ధం చేసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో ఈ పదార్థాలన్నింటినీ వేసి బాగా కలపాలి. పకోడీలు రుచిగా రావాలంటే పిండి తక్కువగా, మష్రూమ్, ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

బాణలిలో నూనె వేడి చేసి, కలిపిన మిశ్రమాన్ని పకోడీల్లా వేయాలి. ఇవి సగం వేగిన తర్వాత (50%) తీసి పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. బయట దొరికే పకోడీలు క్రిస్పీగా ఉండటానికి ఈ 'డబుల్ ఫ్రై' పద్ధతి కీలకం. నూనెను మళ్లీ బాగా మరిగించి, చల్లారిన పకోడీలను అందులో వేసి పెద్ద మంట మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.

ఇలా రెండోసారి వేయించడం వల్ల పకోడీలు మంచి క్రిస్పీగా తయారవుతాయి. ఈ ప్రక్రియతో కేవలం 10 నిమిషాల్లోనే కరకరలాడే మష్రూమ్ ఆనియన్ పకోడీ సిద్ధమవుతుంది.