యెమెన్‌లో హూతీ గ్రూప్ నిర్వహిస్తున్న బాలిస్టిక్ క్షిపణి, డ్రోన్ కార్యక్రమాలకు మద్దతుగా ఉన్న కీలక వనరులను లక్ష్యంగా చేసుకుని సౌదీ నేతృత్వంలోని కూటమి ఒక ఆపరేషన్ నిర్వహించింది. సౌదీ అరేబియా, యెమెన్‌లలో పౌరులపై హూతీల దాడులకు ప్రతిచర్యగా ఆదివారం ఉదయం ఈ ఆపరేషన్ చేపట్టినట్లు కూటమి ప్రతినిధి తుర్కీ అల్-మల్కి X వేదికగా వెల్లడించారు. అయితే ఈ ఆపరేషన్ జరిగిన ప్రాంతం వివరాలను, ఫలితాలను ఆయన స్పష్టం చేయలేదని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.

ఇదే రోజు యెమెన్ దక్షిణ నౌకాశ్రయ నగరమైన అడెన్‌లో మరో ఘటన జరిగింది. అడెన్‌లోని అల్-బురైకా ప్రాంతంలో సౌదీ మద్దతుగల యెమెన్ ప్రభుత్వ సైనిక స్థావరం సమీపంలో హూతీ క్షిపణి ఒకటి దూసుకొచ్చి పడింది. ఈ ఘటనలో బలమైన పేలుడు సంభవించినప్పటికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, పలు ప్రాంతాలలో పెద్ద శబ్దం వినిపించిందని నివాసితులు, భద్రతా అధికారి తెలిపారు. ఈ ఘటనపై హూతీ గ్రూప్ తక్షణమే స్పందించలేదు.

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వ తాత్కాలిక రాజధాని అయిన అడెన్‌పై హూతీలు క్రమంగా క్షిపణి, డ్రోన్ దాడులను పెంచుతున్నారు. గత వారం మక్కా ప్రాంతంలో హూతీ డ్రోన్‌ను కూల్చివేశామని కూటమి ప్రతినిధి తెలిపారు. అయితే సౌదీ అరేబియా వైపు తాము ఎలాంటి దాడులు చేయలేదని, మక్కాపై దాడి చేశామన్న వాదన అబద్ధమని హూతీ సైనిక ప్రతినిధి యహ్యా సరేయా X లో పేర్కొన్నారు.