హర్యానాలోని రోహ్తక్లో ఆదివారం జరిగిన ‘లోక్తంత్ర బచావో.. అరాజక్త హటావో’ అనే పాదయాత్రలో నితిన్ నబిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో అశాంతిని కలిగించేందుకు రాహుల్ గాంధీ విదేశీ శక్తుల టూల్కిట్ ప్రకారం పనిచేస్తున్నారని విమర్శించారు.
ప్రజల తీర్పును అంగీకరించలేక కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్, కర్నాటక ఎన్నికల్లో గెలిచినప్పుడు ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పే కాంగ్రెస్, ఇతర రాష్ట్రాల్లో ఓడిపోయినప్పుడు మాత్రం ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లిందని ఆరోపించడం విడ్డూరమని ఆయన ఎద్దేవా చేశారు.
దేశం గాంధీ కుటుంబం రాసిన నిబంధనల ప్రకారం కాకుండా, రాజ్యాంగం ప్రకారమే నడుస్తుందని నితిన్ నబిన్ స్పష్టం చేశారు. 1984లో జరిగిన సిక్కు అల్లర్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ క్షమాపణ చెప్పలేదని ఆయన గుర్తు చేశారు.
ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించారంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. చనిపోయిన వారు 2.5 కోట్ల మంది, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు 6 కోట్ల మంది ఉన్నారని, అలాగే 3 కోట్ల మంది చొరబాటుదారుల పేర్లను జాబితా నుంచి తొలగించామని ఆయన వివరించారు. అలాంటి పేర్లను తిరిగి ఎందుకు చేర్చాలని రాహుల్ గాంధీ పట్టుబడుతున్నారని ఆయన ప్రశ్నించారు.








