యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం సంప్రదాయంగా చేపట్టారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు జరిపించారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజ నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో భక్తులతో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను భక్తుల మధ్యన జరిపారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాడ వీధిలో అలంకారమూర్తులైన శ్రీస్వామి అమ్మవార్ల జోడు సేవను అర్చకులు, ఆలయ సిబ్బంది ఊరేగించారు.

భువనగిరిటౌన్‌ : ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమించాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్‌ అన్నారు. ఆదివారం భువనగిరి జిల్లా కార్యాలయంలో నిర్వహించిన భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, సీబీఎస్‌ఈ మూల్యాంకన వైఫల్యాలపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం అణచివేత ధోరణి ప్రదర్శించిందని విమర్శించారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా విద్యార్థులు, యువత ఐక్యంగా సాగించిన పోరాట విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటుతున్నా ఎన్నికల హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కనీసం 20 వేల పోస్టులతో పోలీస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్నారు. గ్రూప్‌–1, 2, 3, 4, జూనియర్‌, డిగ్రీ లెక్చరర్లు, ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులకు వెంటనే టీఆర్‌టీ నోటిఫికేషన్లు ఇచ్చి జాబ్‌ క్యాలెండర్‌ను అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పల్లె మధుక్రిష్ణ, జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్‌, ఉపాధ్యక్షులు కవిడే సురేష్‌, దయ్యాల మల్లేష్‌, ఎండీ. సలీంసర్కార్‌, బండారు శ్రావణ్‌, జిల్లా కమిటీ సభ్యులు సుందర్‌, నత్తి నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.