నేపాల్‌లో వరద బాధితులు ప్రస్తుతం తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. వీరికి ప్రభుత్వం అందించే సహాయక కార్డుల (రిలీఫ్ కార్డులు) ద్వారా బియ్యం, పప్పులు, రొట్టెలు, మంచినీళ్ల బాటిళ్లను పంపిణీ చేస్తున్నారు. అయితే, ఉచిత సరకుల కోసం బాధితులు ప్రతిరోజూ వరద తెచ్చిన బురదలో గంటల తరబడి బారులు తీరాల్సి వస్తోంది.

మరోవైపు, వరదల వల్ల దెబ్బతిన్న ఇళ్ల శిథిలాల మధ్య శవాలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి వల్ల ఈగలు, పురుగులు పెరిగి అంటువ్యాధులు వ్యాపిస్తాయని ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఈ ముప్పును గుర్తించిన అధికారులు, అంటువ్యాధులు ప్రబలకుండా బాధితులకు కలరా టీకాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఇక దార్చులా జిల్లాలోని భట్టార్‌ ప్రాంతంలో భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వీటి వల్ల చౌలానీ నది ప్రవాహానికి అడ్డుపడి, రాళ్లు, మట్టితో నది కొంత మేర నిలిచిపోయింది. రాళ్లు తొలగిపోయి దిగువ ప్రాంతాలను వరద ముంచెత్తే అవకాశం ఉందని గుర్తించిన అధికారులు, స్థానికులకు ఫోన్ల ద్వారా హెచ్చరికలు పంపారు. ప్రస్తుతం పోలీసులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

ఇప్పటికే ఇళ్లు కోల్పోయి, దాచుకున్న డబ్బు అంతా వరదల్లో పోవడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. రోజువారీ కూలీ పనులు చేసుకునే తమకు మళ్లీ ఇళ్లు కట్టుకునే ఆర్థిక స్తోమత లేదని, భవిష్యత్తులో ఎలా బతకాలో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలు ఇంకా కోలుకోకముందే, కొండచరియల ముప్పు రావడంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు.