న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దానీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నెతన్యాహును యుద్ధ నేరస్థుడిగా అభివర్ణించిన మామ్దానీ, ఆయన న్యూయార్క్‌కు వస్తే అరెస్ట్ చేస్తామని శనివారం 'ది న్యూయార్క్ టైమ్స్' ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఆరోపణల నేపథ్యంలో ఆయన జైలుకు వెళ్లాల్సిన వ్యక్తి అని మేయర్ వ్యాఖ్యానించారు.
దీనిపై ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. న్యూయార్క్ నగరంలో పెరుగుతున్న యూదు వ్యతిరేకతను అరికట్టడంలో మేయర్ విఫలమయ్యారని, కేవలం వార్తల్లో నిలవడం కోసమే ఆయన ఇజ్రాయెల్‌పై దాడి చేస్తున్నారని విమర్శించారు. మేయర్ బెదిరింపుల వల్ల ఏమీ మారదని ఆయన స్పష్టం చేశారు.
ఒక రేడియో షోలో నెతన్యాహు మాట్లాడుతూ, మేయర్ మామ్దానీ హమాస్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఆయన మనసులో అమెరికాపై తీవ్ర ద్వేషం ఉందని నెతన్యాహు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎవరినైనా అరెస్ట్ చేయాల్సి వస్తే, అది మొదట మేయర్ మామ్దానీనే కావాలని డానీ డానన్ వ్యాఖ్యానించారు.
ప్రధాని నెతన్యాహు సగర్వంగా న్యూయార్క్ వస్తారని, ఐక్యరాజ్యసమితి వేదికగా ఇజ్రాయెల్ తరఫున తన గళం వినిపిస్తారని డానీ డానన్ స్పష్టం చేశారు.







