బాలల లైంగిక నేరాల చట్టం (POCSO) కింద నమోదైన కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (TBA) జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై వేటు పడింది. ఆగస్టు 8, 2026న జరిగిన అసోసియేషన్ అత్యవసర సమావేశంలో ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BFI)కు లేఖ ద్వారా తెలియజేశారు.
పృథ్వీశ్వర్ రెడ్డి స్థానంలో జాయింట్ సెక్రటరీ విష్ణు కుమార్ గౌడ్‌ను కొత్త జనరల్ సెక్రటరీగా నియమిస్తున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది. మరోవైపు, పృథ్వీశ్వర్ రెడ్డిపై ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు కూడా ఆరోపణలు రావడంతో, దీనిపై బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విచారణ చేపట్టింది.
మరోవైపు, నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయడం లేదని బాధితురాలి తల్లిదండ్రులు డీజీపీ, సీపీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వేధింపుల కారణంగా మైనర్ బాలిక తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతోందని, నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని వారు తమ ఫిర్యాదులో కోరారు.








