బ్రెడీ క్రికెట్ క్లబ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను 92 పరుగుల తేడాతో ఓడించి అఫ్గానిస్తాన్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో అఫ్గానిస్తాన్ అధికారికంగా ఐసీసీ వన్డే ప్రపంచకప్-2027కు నేరుగా అర్హత సాధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం వన్డే ర్యాంకింగ్స్‌లో మొదటి ఎనిమిది స్థానాల్లో నిలిచిన జట్లు మాత్రమే ఈ మెగా టోర్నీకి నేరుగా క్వాలిఫై అవుతాయి.
ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న అఫ్గానిస్తాన్‌కు ప్రపంచకప్ బెర్తు దక్కాలంటే ఐర్లాండ్‌తో సిరీస్‌లో కనీసం ఒక్క విజయం అవసరమైంది. రెండో వన్డేలో సాధించిన ఈ విజయంతో ఆ జట్టు తన లక్ష్యాన్ని చేరుకుంది. అఫ్గానిస్తాన్ వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించడం చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే.
అఫ్గానిస్తాన్ విజయం ఐర్లాండ్, వెస్టిండీస్ జట్ల ఆశలపై నీళ్లు చల్లింది. ఐర్లాండ్ నేరుగా క్వాలిఫై కావాలంటే సిరీస్‌ను 4-0తో క్లీన్‌స్వీప్ చేయాల్సి ఉండగా, తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దవ్వడం, రెండో మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఆ జట్టు అవకాశాలు దెబ్బతిన్నాయి. మరోవైపు, ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్న వెస్టిండీస్ కూడా ప్రపంచకప్ రేసు నుంచి తప్పుకుంది.
గత 2023 ప్రపంచకప్‌లో కూడా వెస్టిండీస్ జట్టు క్వాలిఫై కాలేకపోయింది. అప్పట్లో క్వాలిఫైయర్స్‌లో సూపర్-6 దశలో స్కాట్లాండ్ చేతిలో ఓడిపోయి మెగా టోర్నీకి దూరమైంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ మెగా టోర్నీకి సౌతాఫ్రికా, నమీబియా, జింబాబ్వేలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.







