జగిత్యాల జిల్లా నూకపల్లిలోని డబుల్ బెడ్‌రూమ్ హౌసింగ్ కాంప్లెక్స్‌లో ఒక మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. నిజామాబాద్‌కు చెందిన బాధితురాలిని మల్యాల మండలానికి చెందిన ఒక యువకుడు రెండు రోజుల క్రితం జగిత్యాలకు పిలిపించాడు. అనంతరం ఆమెను నూకపల్లిలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు తీసుకెళ్లి, తన స్నేహితులతో కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు మల్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు గుర్రం శ్రీకాంత్, శివరాత్రి నరేష్, మల్లేశం, అంజయ్యగా పోలీసులు గుర్తించారు. వీరిలో ముగ్గురు రాజారాం గ్రామానికి చెందినవారు కాగా, మరొకరు ధరూర్‌కు చెందిన వ్యక్తి. ఘటన సమయంలో అంజయ్య, మల్లేశం ఇంటి బయట కాపలా ఉండగా, గుర్రం శ్రీకాంత్, శివరాత్రి నరేష్ బాధితురాలిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
ప్రధాన నిందితులైన గుర్రం శ్రీకాంత్, శివరాత్రి నరేష్‌లపై ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్లు ఉన్నాయని మల్యాల సీఐ రాజ్ కుమార్ వెల్లడించారు. నిందితులు నేరం చేయడానికి ఉపయోగించిన ఇన్నోవా క్రిస్టా కారును, వారి మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలిపై జరిగిన అఘాయిత్యాన్ని నిందితులు మొబైల్‌లో రికార్డు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రాజ్ కుమార్ హెచ్చరించారు. విచారణ తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.








