హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల పరిధిలో సీనియర్ సిటిజన్లను మోసం చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 19 నెలల కాలంలోనే సైబర్ నేరగాళ్లు వృద్ధుల నుంచి రూ. 102.02 కోట్లను అక్రమంగా కాజేశారు. ఈ వ్యవహారంపై మొత్తం 403 కేసులు నమోదయ్యాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.
ప్రధానంగా ట్రేడింగ్ పేరుతో జరుగుతున్న మోసాల్లో బాధితులు అత్యధికంగా రూ. 55.88 కోట్లు కోల్పోయారు. ఆ తర్వాత 'డిజిటల్ అరెస్ట్' పేరుతో బెదిరించి రూ. 31.93 కోట్లను నేరగాళ్లు వసూలు చేశారు. వీటితో పాటు ఓటీపీ (OTP) మోసాలకు సంబంధించి 115 కేసులు నమోదవ్వగా, అందులో రూ. 4.94 కోట్ల నష్టం వాటిల్లింది.
ఈ తరహా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, ట్రేడింగ్ యాప్స్ మరియు డిజిటల్ అరెస్ట్ వంటి బెదిరింపుల విషయంలో జాగ్రత్త వహించాలని ఆయన హెచ్చరించారు.








