విశాఖసిటీ, ఆంధ్రప్రభ: ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు నానా అవస్థలు పడుతున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కోక్ ఓవెన్స్ రూపంలో మరో పెనుముప్పు పొంచి ఉంది. ప్లాంట్ ఉత్పత్తి వ్యవస్థకు గుండెకాయలాంటి కోక్ ఓవెన్స్ విభాగం నానాటికీ బలహీనపడుతుండటంతో దాని ప్రభావం బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి రోలింగ్ మిల్లుల వరకు విస్తరిస్తోంది. బ్యాటరీల పనితీరు దారుణంగా పడిపోవడంతో కోక్ ఉత్పత్తి చరిత్రలోనే అత్యల్ప స్థాయికి చేరుకోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. కోక్ ఓవెన్లోని ఒకటి, రెండు, మూడు బ్యాటరీలు ఇప్పటికే పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. నాలుగో బ్యాటరీ కూడా పరిమిత సామర్థ్యంతోనే నడుస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఐదో బ్యాటరీపైనే ప్రధానంగా ఆధారపడి కోక్ ఉత్పత్తి కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కీలకమైన విభాగంలో ఒకే బ్యాటరీపై అధికంగా ఆధారపడటం భవిష్యత్‌లో మరిన్ని సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.

ఉక్కులో కోక్ ఓవెన్స్ బ్యాటరీల దుస్థితి, వాటి సామర్థ్యం క్రమంగా క్షీణిస్తున్న తీరు, భవిష్యత్‌లో ఉత్పత్తిపై పడే ప్రభావంపై ‘ఆంధ్రప్రభ’ ముందుగానే హెచ్చరించింది. జూన్ 1న ‘క్లిష్ట పరిస్థితుల్లో ఉక్కు కోక్ ఓవెన్స్’ శీర్షికన ప్రచురించిన ప్రత్యేక కథనంలో బ్యాటరీల పరిస్థితిని, ఉత్పత్తి వ్యవస్థ ఎదుర్కొంటున్న ముప్పును వివరించింది. తాజాగా కోక్ ఉత్పత్తి కనిష్ట స్థాయికి పడిపోవడంతో అప్పట్లో చేసిన హెచ్చరికలు నిజమవుతున్నాయని ఉద్యోగవర్గాలు పేర్కొంటున్నాయి.

విశాఖ ఉక్కు కోక్ ఓవెన్స్ విభాగంలో ఈ నెల 7న కేవలం 115 హీట్స్ పుషింగ్ జరగడం స్టీల్ ప్లాంట్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణ పరిస్థితుల్లో అన్ని బ్యాటరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే మూడు షిఫ్టుల్లో కలిపి రోజుకు సుమారు 450 వరకు పుషింగ్స్ జరగాల్సి ఉంటుంది. అయితే బ్యాటరీలు ఒక్కొక్కటిగా నిర్వీర్యమవుతుండటంతో ఉత్పత్తి క్రమంగా దిగజారుతూ వచ్చింది. చివరకు 115 పుషింగ్స్‌కు పడిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 7న ప్లాంట్‌లో సుమారు 12,800 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి కాగా, స్టీల్ మెల్టింగ్ షాప్‌లో 73 హీట్స్ ఉత్పత్తి జరిగినట్లు సమాచారం. కోక్ ఉత్పత్తి మరింత తగ్గితే దాని ప్రభావం హాట్ మెటల్ ఉత్పత్తిపైనా తప్పకుండా పడుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. బ్లాస్ట్ ఫర్నేస్‌లలో ఇనుము తయారీకి కోక్ అత్యంత కీలకమైన ముడి పదార్థం కావడంతో కోక్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే మొత్తం ఉత్పత్తి గొలుసు దెబ్బతినే అవకాశం ఉందని వారు వివరిస్తున్నారు.

కోక్ ఓవెన్స్‌లో ఉత్పత్తి పడిపోవడంతో ప్లాంట్ అవసరాల కోసం బయట మార్కెట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి నెలా సుమారు 1.20 లక్షల టన్నుల కోక్‌ను బయట నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోందని సమాచారం. భారీ ధరలకు కోక్‌ను కొనుగోలు చేయడం సంస్థ ఆర్థిక పరిస్థితిపై మరింత భారాన్ని మోపుతోందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. మరోవైపు కోక్ ఓవెన్స్‌లో ముడి పదార్థంగా వినియోగించేందుకు కొనుగోలు చేసిన సుమారు 10 లక్షల టన్నుల కోకింగ్ బొగ్గు పోర్టులు, యార్డుల్లో వినియోగానికి నోచుకోకుండా నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వైపు ముడి పదార్థం నిల్వ ఉండగా.. మరోవైపు అదే అవసరానికి సంబంధించిన కోక్‌ను బయట నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి సంస్థలో నెలకొనడం విస్మయానికి గురిచేస్తోందని ఉద్యోగులు అంటున్నారు.

కోక్ ఓవెన్స్ సంక్షోభం ప్రభావం కేవలం కోక్ ఉత్పత్తికే పరిమితం కావడం లేదు. కోక్ తయారీ ప్రక్రియలో లభించే కోక్ ఓవెన్ గ్యాస్ కూడా ప్లాంట్‌లోని పలు విభాగాలకు కీలక ఇంధనం. ముఖ్యంగా రోలింగ్ మిల్లుల్లోని ఫర్నేస్‌ల నిర్వహణకు ఈ గ్యాస్ అవసరం. కోక్ ఓవెన్స్ ఉత్పత్తి పడిపోవడంతో గ్యాస్ లభ్యత కూడా తగ్గిపోయింది. ఫలితంగా రోలింగ్ మిల్లుల ఉత్పత్తి సామర్థ్యం సుమారు 55 శాతానికే పరిమితమైందని సమాచారం. ఉత్పత్తి చేసిన ఉక్కులో కేవలం కొంత భాగం మాత్రమే పూర్తిస్థాయి ఉత్పత్తిగా మారుతుండగా, మిగిలినది సెమీ ఫినిష్డ్ ఉత్పత్తిగా తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తోందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల సంస్థకు భారీగా ఆదాయ నష్టం వాటిల్లుతున్నదని పేర్కొంటున్నారు.

కేవలం మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లను నడిపేందుకు 2026 మార్చి నాటికి ఆర్ఐఎన్ఎల్ ఏడు లక్షల టన్నులకు పైగా కోక్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. మూడో బ్లాస్ట్ ఫర్నేస్‌ను ప్రారంభించడం వల్ల సంస్థపై అదనపు భారం పడుతుందని, కోక్ ఓవెన్స్ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని అప్పట్లో ఉద్యోగ సంఘాలు హెచ్చరించినప్పటికీ వాటిని పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఆ సమయంలో ఒకవైపు బ్లాస్ట్ ఫర్నేస్‌ల సంఖ్య పెంచుతూ వెళ్లగా.. మరోవైపు కోక్ ఓవెన్స్ బ్యాటరీల సామర్థ్యం క్రమంగా క్షీణించింది. నేడు కనీసం రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లకు అవసరమైన స్థాయిలో కూడా కోక్ ఉత్పత్తి చేయలేని దుస్థితి నెలకొందని ఉద్యోగులు వాపోతున్నారు.

ఇప్పటికే తీవ్ర సమస్యల్లో ఉన్న కోక్ ఓవెన్స్ విభాగానికి శనివారం తెల్లవారుజామున మరో ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. సుమారు నాలుగు గంటల సమయంలో బ్యాటరీ-1లోని ఓవెన్ టాప్‌పై చార్జింగ్ జరుగుతున్న కార్ నంబర్ 10 వద్ద మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించినట్లు సమాచారం. చార్జింగ్ చూట్ల నుంచి వచ్చిన మంటల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఉత్పత్తి సంక్షోభంలో ఉన్న బ్యాటరీ-1లో ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం విశాఖ ఉక్కు ఎదుర్కొంటున్న సంక్షోభానికి కేవలం ప్రస్తుత పరిస్థితులే కారణం కాదని, గతంలో తీసుకున్న పలు విధానపరమైన నిర్ణయాలు కూడా సంస్థను ఈ స్థితికి తీసుకొచ్చాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కోక్ ఓవెన్స్ బ్యాటరీల పునరుద్ధరణ, కొత్త బ్యాటరీ నిర్మాణం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతర అవసరాలపై దృష్టి పెట్టడం వల్ల ప్రస్తుతం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

కోక్ ఓవెన్స్ విభాగాన్ని శాశ్వతంగా బలోపేతం చేయాలంటే కొత్త బ్యాటరీ నిర్మాణంతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న బ్యాటరీలకు తక్షణ మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆరో బ్యాటరీ నిర్మాణానికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.

విశాఖ ఉక్కులో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం తక్షణమే దృష్టి సారించాలని ఉద్యోగులు కోరుతున్నారు. స్థానిక యాజమాన్యంతో సమన్వయం చేసుకుని కోక్ ఓవెన్స్ విభాగాన్ని పునరుద్ధరించేందుకు అత్యవసర ప్రణాళిక రూపొందించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బ్యాటరీలకు తక్షణ మరమ్మతులు చేపట్టి వాటి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఆరో బ్యాటరీ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, ప్లాంట్‌లోని అన్ని విభాగాలు పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా అవసరమైన కోక్, కోక్ ఓవెన్ గ్యాస్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

కోక్ ఓవెన్స్ సమస్యను ఇప్పుడే పరిష్కరించకపోతే.. దాని ప్రభావం ఒక్క విభాగానికే పరిమితం కాకుండా బ్లాస్ట్ ఫర్నేస్‌లు, స్టీల్ మెల్టింగ్ షాప్, రోలింగ్ మిల్లులు ఇలా మొత్తం ఉత్పత్తి వ్యవస్థపై పడే ప్రమాదం ఉందని ఉద్యోగ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆర్ఐఎన్ఎల్‌కు ఇది మరో పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.