వినాయక చవితి, శ్రీకృష్ణాష్టమి వంటి పర్వదినాల్లో దేవుడికి సమర్పించే నైవేద్యాల్లో తీపి అటుకులు ఒకటి. సమయం తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రసాదాన్ని ఎవరైనా సులభంగా తయారుచేయవచ్చు. ఇది దేవుడికి నైవేద్యంగానే కాకుండా, ఇంట్లో పిల్లలు ఏదైనా తీపి తినాలనిపించినప్పుడు కూడా చక్కటి ఎంపికగా ఉంటుంది.
ఈ ప్రసాదం తయారీకి రెండు కప్పుల సన్నటి అటుకులు, ముప్పావు కప్పు తురిమిన బెల్లం, అర కప్పు ఎండు కొబ్బరి తురుము, పావు కప్పు జీడిపప్పు, కిస్‌మిస్ అవసరం. వీటితో పాటు మూడు టీస్పూన్ల నెయ్యి, పావు టీస్పూన్ యాలకుల పొడి, చిటికెడు పచ్చ కర్పూరం సిద్ధం చేసుకోవాలి. అటుకులను జల్లెడ పట్టి అందులోని నూకను వేరు చేయడం వల్ల ప్రసాదం రుచిగా ఉంటుంది.
ముందుగా పాన్‌లో రెండు టీస్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌ను దోరగా వేయించాలి. అదే పాన్‌లో మరో టీస్పూన్ నెయ్యి వేసి ఎండు కొబ్బరి తురుమును బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత అటుకులను కూడా పాన్‌లో వేసి, రంగు మారకుండా కేవలం వేడెక్కి క్రిస్పీగా అయ్యే వరకు ఒకటి రెండు నిమిషాలు వేయించాలి.
ఇప్పుడు వేయించిన అటుకులు, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి తురుమును ఒక పాత్రలో వేసి బాగా కలపాలి. మరోవైపు పావు కప్పు నీటిలో బెల్లం వేసి కరిగించి, నలకలు లేకుండా వడకట్టాలి. ఈ బెల్లం నీటిని చిక్కటి పాకం వచ్చే వరకు మరిగించాలి. గులాబ్ జామున్ పాకం కంటే కాస్త చిక్కగా, జిగురుగా ఉండేలా చూసుకోవాలి.
పాకం సిద్ధమయ్యాక మంట తగ్గించి, ముందుగా కలిపి పెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని అందులో వేయాలి. పాకం అటుకులకు సమానంగా పట్టేలా నెమ్మదిగా కలుపుతూ యాలకుల పొడి, పచ్చ కర్పూరం జత చేయాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో భద్రపరిస్తే వారం రోజుల పాటు తాజాగా ఉంటుంది.








