విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలోని సుజనా ఫౌండేషన్, పేద మరియు మధ్యతరగతి ప్రజల కోసం ప్రతి వారాంతంలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా శనివారం 38వ డివిజన్‌లోని కుమ్మరిపాలెం సెంటర్, లోటస్ లెజెండ్ అపార్ట్‌మెంట్ సమీపంలో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో 126 మంది స్థానికులు వైద్య సేవలను పొందారు. కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలను సామాన్యులకు ఉచితంగా అందించడమే లక్ష్యంగా ఈ శిబిరాలు సాగుతున్నాయని నిర్వాహకులు వెల్లడించారు.
ఈ శిబిరంలో దంత, కంటి పరీక్షలతో పాటు ఈసీజీ, 2డీ ఎకో, ఎక్స్‌రే, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను వైద్యులు పరీక్షించారు. జనరల్ ఫిజీషియన్లు కూడా అందుబాటులో ఉండి రోగులకు చికిత్స అందించారు.
వాసన్ ఐ కేర్, పీవీఆర్ హాస్పిటల్స్ వైద్య బృందాలు ఈ శిబిరంలో పాల్గొని సేవలు అందించాయి. సుజనా మిత్ర కోఆర్డినేటర్లు, ఫౌండేషన్ సిబ్బంది పర్యవేక్షణలో రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.








