విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తనయుడైన సిద్ధార్థ, కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సింగ్‌నగర్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేదికపై మంత్రి లోకేష్‌ను కలిసిన సిద్ధార్థ, ఆయనతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా సిద్ధార్థను లోకేష్ ఆప్యాయంగా పలకరించి, ఆయన చేపడుతున్న రాజకీయ కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు.

రానున్న మున్సిపల్ ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలని, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని లోకేష్ సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డివిజన్ల వారీగా కార్యకర్తలను సమన్వయం చేసుకోవడం, యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడంపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. దీంతో స్థానిక ఎన్నికల్లో సిద్ధార్థ పాత్రపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే సిద్ధార్థ ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. నియోజకవర్గంలోని సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో తన పట్టును పెంచుకుంటున్నారు.

మరోవైపు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు సిద్ధార్థ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. సొంత నిధులతో కుట్టుమిషన్లు, ఇస్త్రీ పెట్టెలు, తోపుడు బండ్లను పంపిణీ చేస్తూ స్వయం ఉపాధికి చేయూతనిస్తున్నారు. రాజకీయాలతో పాటు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ యువ నాయకుడిగా తనదైన ముద్ర వేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.