ప్రధాన ప్రతిపక్ష నేతగా జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ మొఖం చాటేస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం, సెప్టెంబర్ 5న గజ్వేల్‌లో కాంగ్రెస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివేక్, కేసీఆర్‌కు నేరుగా సవాల్ విసిరారు.
అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజల సమస్యలపై చర్చించాలని మంత్రి కోరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రెండున్నరేళ్ల అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు. ప్రజలకు అన్యాయం ఎవరు చేస్తున్నారో అసెంబ్లీ వేదికగానే తేల్చుకుందామని సవాల్ చేశారు.
గత పదేళ్ల అధికారంలో కేసీఆర్ ప్రజా సమస్యలను పట్టించుకోలేదని వివేక్ ఆరోపించారు. తనను గెలిపించిన గజ్వేల్ ప్రజలకు కూడా ఆయన అందుబాటులో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని మంత్రి గుర్తుచేశారు. ఆ అప్పులకు సంబంధించి వడ్డీలను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తోందని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చించే బాధ్యత నుంచి ప్రతిపక్ష నేత తప్పుకోకూడదని మంత్రి స్పష్టం చేశారు.







