దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న 'రణబాలి' చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 'టాక్సీవాలా' వంటి హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటం, దానికి తోడు విజయ్, రష్మిక మూడోసారి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇది సాధారణ కథాంశంతో కాకుండా పీరియాడికల్ జానర్‌లో రూపొందుతోంది.
షూటింగ్ ప్రారంభమైన కొత్తలోనే నిర్మాతలు సెప్టెంబర్ 11న సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే, విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి కారణంగా షూటింగ్‌కు విరామం రావడంతో, అనుకున్న సమయానికి సినిమాను సిద్ధం చేయడం సాధ్యం కాదని చిత్ర బృందం భావిస్తోంది. దీంతో త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
ప్రస్తుతం కొత్త తేదీ కోసం మేకర్స్ ప్రయత్నిస్తున్నా, థియేటర్లలో స్లాట్లు అన్నీ నిండిపోయి ఉన్నాయి. అక్టోబర్ 2న వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం' విడుదల కానుంది. దసరా పండుగ అక్టోబర్ 20న ఉండటంతో, అక్టోబర్ 16న సినిమాను విడుదల చేసే అంశాన్ని చిత్ర బృందం పరిశీలిస్తోంది.
నవంబర్ నెలలో శుక్రవారాలు ఖాళీగా ఉన్నప్పటికీ, అన్‌సీజన్ కావడంతో మేకర్స్ ఆసక్తి చూపడం లేదు. డిసెంబర్ 3న 'ఫౌజీ', డిసెంబర్ 24న 'NBK109' విడుదల కానున్నాయి. దసరా రేసులో ప్రస్తుతం 'జైలర్ 2' మాత్రమే ఉంది కాబట్టి, ఆ పండుగ సీజన్‌ను 'రణబాలి' ఉపయోగించుకుంటుందేమో చూడాలి.








