తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమైన చిత్రం 'డిసి'. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. ఎలాంటి ప్రమోషన్లు లేకుండా విడుదలైన ఈ చిత్రం, ప్రీమియర్ల నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది.

అయితే, ఈ కథలో హీరోగా నటించే అవకాశం మొదట టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండకు దక్కింది. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ఈ కథను విజయ్ దేవరకొండకు వినిపించగా, తాను చేస్తున్న ఇతర సినిమాల తరహాలోనే ఉండటంతో ఆయన ఈ ప్రాజెక్టును తిరస్కరించారు. దీనికి సంబంధించిన విజయ్ దేవరకొండ పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తోంది.

విజయ్ దేవరకొండ నో చెప్పడంతో, ఈ అవకాశం లోకేష్ కనగరాజ్ వద్దకు వెళ్లింది. లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి జంటగా నటించిన ఈ తమిళ సినిమా, తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ రెండో రోజు మంచి వసూళ్లు సాధిస్తోంది. బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా పుంజుకుంటున్న ఈ సినిమా విజయం దిశగా దూసుకెళ్తోందని మేకర్స్ పేర్కొన్నారు.